- బీజేపీకి 20 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుకు అన్నా డీఎంకే ఓకే
- పీఎంకేకు 23 సీట్లు ఇచ్చిన రూలింగ్ పార్టీ
- 6 పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న డీఎంకే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, రూలింగ్ పార్టీ అన్నా డీఎంకే మధ్య సీట్ల పంపకం పూర్తయింది. కన్యాకుమారి పార్లమెంట్ సీటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లు బీజేపీకి కేటాయిస్తూ రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంపై సీఎం కె.పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, పార్టీ స్టేట్ చీఫ్ మురుగన్ శనివారం సంతకాలు చేశారు. ఆరుగురు కేండిడేట్లతో ఫస్ట్ లిస్టును అన్నాడీఎంకే శుక్రవారమే విడుదల చేసింది. పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీకి 23 సీట్లు కేటాయిస్తూ ఆ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 2016 ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాలకు గాను134 సీట్లు గెలిచిన ఏఐఏడీఎంకే.. ఈ సారి170 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. కన్యాకుమారి ఎంపీ, కాంగ్రెస్ నేత వసంత్ కుమార్.. కరోనాతో పోయినేడాది మరణించారు. దీంతో ఆ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ కేండిడేట్గా ఆ పార్టీ స్టేట్ మాజీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ బరిలోకి దిగనున్నారు.
సీపీఎం, కాంగ్రెస్తో డీఎంకే చర్చలు
అపొజిషన్లోని ప్రధాన పార్టీ అయిన డీఎంకే.. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్, అన్నాడీఎంకే వంటి పార్టీలతో జట్టు కడుతోంది. వైగో ఆధ్వర్యంలోని ఎండీఎంకేకు 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఎండీఎంకే కేండిడేట్లు డీఎంకే గుర్తు(రైజింగ్ సన్)పైనే పోటీ చేయనున్నారు. సీపీఐకి కూడా 6 సీట్లు ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పటికే వీసీకే, సీపీఐ, ఐయూఎంఎల్, ఎంఎంకే పార్టీలకు 17 సీట్లను ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించింది. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలతో మాత్రం సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు.
నేడు తమిళనాడుకు అమిత్ షా
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తమిళనాడు, కేరళ లో పర్యటిస్తారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ను ఆయన ప్రారంభించనున్నారు.కన్యాకుమారిలో రోడ్ షో నిర్వహించడంతోపాటు పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. తిరువనంతపురంలో బీజేపీ ‘కేరళ విజయ యాత్ర’లో ఆయన మాట్లాడతారు.
